India Thrash United States in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుని సూపర్-8లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ చెమటోడ్చాల్సి వచ్చింది. 3 వికెట్లు కోల్పోయి కానీ.. 18.2 ఓవర్లకు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్; 49 బంతుల్లో 2×4, 2×6), శివమ్ దూబే (31 నాటౌట్; 35 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ (2/18) అదరగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 రన్స్ చేసింది. నితీశ్ కుమార్ (27; 23 బంతుల్లో 2×4, 1×6), స్టీవెన్ టేలర్ (24; 30 బంతుల్లో 2×6) ఫర్వాలేదనిపించారు. జహంగీర్ (0), గౌస్ (2), ఆరోన్ జోన్స్ (11), కోరీ అండర్సన్ (15), హర్మీత్ (10), షాడ్లీ (11) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ (4/9) 4 వికెట్స్ తీయగా.. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. మోనాంక్ పటేల్ గాయపడడంతో ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏకు జోన్స్ నాయకత్వం వహించాడు.
Also Read: Borugadda Anil: పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. బోరుగడ్డ ఆఫీస్ దగ్ధం!
ఛేదనలో భారత కుర్రాడే అయిన సౌరబ్ నేత్రావల్కర్ టీమిండియాను ఆరంభంలోనే దెబ్బ కొట్టాడు. రెండో బంతికే విరాట్ కోహ్లీ (0)ని ఔట్ చేసిన నేత్రావల్కర్.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రోహిత్ శర్మ (3)నూ పెవిలియన్ చేర్చాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ (18) ధాటిగా ఆడి యుఎస్ బౌలర్లపై పైచేయి సాధించాలని చూశాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నిలదొక్కుకోవడానికి తంటాలు పడ్డాడు. భారత్ కుదురుకుంటున్న దశలో పంత్‌ను అలీ ఖాన్ బౌల్డ్ చేశాడు. అనంతరం సూర్యకు జత కలిసిన శివమ్ దూబె ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బంతి బ్యాట్ మీదికి రాకపోవడంతో.. తన శైలిలో షాట్లు ఆడడానికి ఇబ్బంది పడ్డాడు. 13 ఓవర్లకు భారత్ 60/3 కాగా.. లక్షాన్ని ఛేదించడం చాలా కష్టంగానే కనిపించింది. అయితే సూర్య, దూబె సరైన సమయంలో బ్యాట్లు ఝళిపించడంతో లక్ష్యంను భారత్ చేరుకుంది.