Bangladesh ICC Row: మూడు వారాలకు పైగా బంగ్లాదేశ్- ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మధ్య టీ20 వరల్డ్ కప్ 2026పై వివాదం కొనసాగింది. టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభ దశలో బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతా, ముంబై వేదికలలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌లో భద్రతా ఆందోళనలు ఉన్నాయని పేర్కొంటూ, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. భారత ప్రీమియర్ లీగ్ నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్ ని తప్పించడంతో భారత్‌లో జరగాల్సిన తమ మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చాలని బంగ్లా చేసిన విజ్ఞప్తిపై ఐసీసీ తిరస్కరించింది.
Read Also: Vijay Devarakonda : నితిన్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్ దేవరకొండ సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్
అయితే, ఐసీసీ నిర్ణయంపై తుది అభిప్రాయం చెప్పేందుకు బంగ్లాదేశ్‌కు 24 గంటల గడువు ఇచ్చింది. అయినప్పటికీ బంగ్లా తమ వైఖరిని మార్చుకోకపోవడంతో, ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించి, అర్హత సాధించలేని జట్లలో అగ్రస్థానంలో ఉన్న స్కాట్లాండ్ ని తుది జాబితాలో చేర్చింది. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నమెంట్‌ను బహిష్కరించే అవకాశం ఉందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, కేవలం భారత్‌తో జరిగే మ్యాచ్‌లను ఆడకపోవచ్చని ఇంకొన్ని కథనాలు వచ్చాయి. ఇంత జరుగుతున్నా, సహ ఆతిథ్య దేశమైన శ్రీలంక చాలా రోజులుగా మౌనంగా ఉండిపోయింది. చివరకు ఈ అంశంపై శ్రీలంక తాజాగా స్పందించింది.
Read Also: Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
ఇక, శ్రీలంక క్రికెట్ కార్యదర్శి బండుల దిస్సానాయకే మాట్లాడుతూ.. ప్రాంతీయ వివాదాల్లో శ్రీలంక జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. “భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఈ వివాదాల్లో మేము తటస్థంగా ఉంటాం.. ఈ దేశాలన్నీ మా మిత్ర దేశాలే అన్నారు. అవసరమైతే భవిష్యత్తులో ఏ దేశానికైనా టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీలంక సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.
Read Also: Gold Rush: బంగారం, వెండి కొనుగోలుకు జనం పరుగులు.. షాపుల ముందు క్యూ కట్టి మరీ!
కాగా, ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్తతలతో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ తమ మ్యాచ్‌లన్నింటినీ, భారత్‌తో మ్యాచ్ సహా అన్నింటినీ శ్రీలంకలోనే ఆడనుంది. టోర్నమెంట్ సజావుగా సాగేందుకు శ్రీలంక అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆ దేశ క్రీడల మంత్రి సునీల్ కుమార గమేజ్ తెలిపారు. ముఖ్యంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమవుతుండగా, మార్చి 8వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.