Site icon NTV Telugu

Akhtar-Mohsin Naqvi: క్రికెట్‌పై ఏమాత్రం అవగాహన లేదు.. మోహ్సిన్ నక్వీపై షోయబ్ అక్తర్ ఫైర్!

Shoaib Akhtar Fires on Mohsin Naqvi: ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. జట్టు పరిపాలన, ఆటగాళ్ల ప్రదర్శన, వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా క్రికెట్‌పై అవగాహన లేని వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మోహ్సిన్ నక్వీపై విమర్శలు గుప్పించాడు. రాజకీయాల్లో బిజీగా ఉండే వ్యక్తి.. క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడడని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పాక్ పూర్తిగా తేలిపోయింది. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. దాంతో పాక్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ జట్టు ప్రదర్శనపై మాట్లాడుతూ… ‘స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ 6-7 సంవత్సరాలుగా ఐసీసీ టోర్నీల్లో ఆడుతున్నాడు. అయినా కూడా భారత్‌పై గుర్తుండిపోయే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అంతేకాదు జట్టు మొత్తం ఒకే బౌలర్‌పై ఆధారపడుతోంది. షాహిన్ అఫ్రిదిపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం సరైన వ్యూహం కాదు. సరైన బెంచ్ స్ట్రెంగ్త్ లేకపోవడం కూడా జట్టు బలహీనతగా మారింది’ అని చెప్పాడు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహణపై షోయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘సరైన వ్యక్తులు సరైన స్థానాల్లో లేకపోతే ట్రోఫీల గురించి మాట్లాడటం అనవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు విజయాల గురించి కలలు కనడం కష్టమే. క్రికెట్‌పై అవగాహన లేని వ్యక్తిని చైర్మన్‌గా నియమించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో బిజీగా ఉండే వ్యక్తి.. క్రికెట్ అభివృద్ధికి ఎలా సహకరిస్తారు. వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే జట్టు తిరిగి బలపడుతుంది, లేకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది’ అని అక్తర్ హెచ్చరించాడు. పాక్ క్రికెట్‌పై అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు కూడా పాకిస్థాన్ క్రికెట్ పరిపాలనపై ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్తర్ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

Exit mobile version