Sayali Sanjeev Gives Clarity On Affair Rumours With Ruturaj Gaikwad: సినిమా & క్రికెట్. ఈ రెండు రంగాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ తారలు క్రికెటర్స్‌తో ప్రేమలో పడటం, కొందరు పెళ్లిదాకా వెళ్లడం లాంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఎవరైనా కాస్త సన్నిహితంగా మెలిగితే చాలు, వారి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు మరాఠీ నటి సయాలీ సంజీవ్, క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌లపై కూడా అలాంటి ప్రచారాలే వచ్చాయి. కొంతకాలం నుంచి సన్నిహితంగా ఉంటుండటం, కలిసి కొన్నిసార్లు కెమెరాలకు కూడా చిక్కడంతో.. వీళ్లు ప్రేమలో ఉన్నారన్న పుకార్లు షికార్లు చేశాయి. వీటిపై స్పందించకుండా వాళ్లు మౌనం పాటించడంతో.. ఆ పుకార్లు మరింత రెచ్చిపోయాయి. త్వరలోనే తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేసి, పెళ్లి చేసుకోవాలని కూడా ఆ జంట నిర్ణయించుకున్నట్టు గాసిప్పులు గుప్పుమన్నాయి. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా సయాలీ సంజీవ్ కుండబద్దలు కొట్టింది.
సయాలీ సంజీవ్ మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే. అంతకుమించి మా మధ్య ఇంకేం లేదు. ఈ రూమర్స్ వల్ల మా స్నేహం దెబ్బతింది. మునుపటిలాగా మేమిద్దరం కనీసం స్నేహితులుగా కూడా మాట్లాడుకోవడం లేదు. అయినా మా ఇద్దరి మధ్య ఎందుకు లింక్ పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కాస్త సన్నిహితంగా ఉంటే, లింక్ పెట్టేస్తారా? ఇలాంటి రూమర్స్ వల్ల మా వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుకార్లు పుట్టించేవాళ్లకు అది అర్థం అవ్వదు. రుతురాజ్ ఒక మంచి ఆటగాడు. అతని ఆట గురించే మేమిద్దరం మాట్లాడుకునేవాళ్లం. కానీ.. మాకు లింక్ పెడుతూ వార్తలు రావడంతో, అది మాట్లాడుకోవడం కూడా మానేయాల్సి వచ్చింది. మా భాగస్వాములను ఎంచుకున్న తర్వాత.. జనాలు మాది స్నేహమని తెలుసుకుంటారని అనుకున్నాను. కానీ ఈ పుకార్లు మరింత వ్యాప్తు చెందుతూనే ఉండటంతో.. వాటి వల్ల ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని గ్రహించి, ఇలా స్పందించాల్సి వస్తోంది. ఇంట్లోవాళ్లకు కూడా సమస్యేనని మేమిద్దరం అర్థం చేసుకున్నాం. అతడు ఏదైనా విజయం సాధించినప్పుడు కంగ్రాట్స్ చెప్పాలనిపిస్తుంది కానీ, మళ్లీ ఎక్కడ పుకార్లు పుట్టుకొస్తాయోనన్న భయంతో, ఆ పనిచేయలేకపోతున్నా. అతనిది కూడా అదే పరిస్థితి’’ అంటూ చెప్పుకొచ్చింది.