Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ సర్గార్‌కు సిల్వర్ పతకం లభించింది. శనివారం జరిగిన 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రెండో స్థానంలో నిలిచాడు. 55 కిలోల విభాగంలో సంకేత్ 248 కిలోలు ఎత్తాడు. స్నాచ్‌లో 114 కిలోలు ఎత్తగా.. క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు లిఫ్ట్ చేశాడు. దురదృష్టకరమైన అంశం ఏమిటంటే క్లీన్ అండ్ జెర్క్ రెండో పర్యాయంలో సంకేత్ గాయపడ్డాడు. దాంతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. కానీ ఆఖరి వరకు సంకేత్ స్వర్ణం కోసం శ్రమించాడు.
Read Also: Rare Love Marriage: అరుదైన ప్రేమ పెళ్లి. ఆన్ లైన్ వివాహానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మలేసియాకు చెందిన బిబ్ అనిక్ మొత్తం 249 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించాడు. తన ప్రదర్శనతో బిబ్ అనిక్ కామన్వెల్త్ గేమ్స్‌లో రికార్డు నెలకొల్పాడు. మరోవైపు శ్రీలంకకు చెందిన దిలంక యోదగె 225 కేజీలతో కాంస్య పతకం దక్కించుకున్నాడు. కాగా సంకేత్ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ లిఫ్టర్లు కావడం విశేషం. దీంతో కుటుంబ వారసత్వాన్ని అతడు నిలబెట్టాడు. స్వర్ణం గెలవాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకే స్నాచ్‌లో ఎలాంటి రిస్క్ చేయలేదు. వరుసగా 107, 111, 113 కిలోలు ఎత్తాడు. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి పర్యాయంలోనే 135 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తం బరువును 248 కిలోలకు పెంచాడు. అయితే అతడి మోచేయి బెణకడంతో మూడో లిఫ్ట్‌కు వచ్చి బరువు మోసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒకవేళ మోచేతి గాయం కాకుండా ఉంటే సంకేత్ స్వర్ణం సాధించి తన కలను సాకారం చేసుకునేవాడు.