ప్రస్తుతం టీమిండియాలో వృద్ధిమాన్ సాహా వివాదం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలంకతో సిరీస్‌కు సాహాను సెలక్టర్లు పక్కన పెట్టగా… అతడి ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్టు బెదిరించడం రచ్చ రేపుతోంది. దీనిపై బీసీసీఐ రంగంలోకి దిగిందని.. దర్యాప్తు చేపట్టిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదంపై సాహా స్వయంగా స్పందించాడు. ఇప్పటివరకు తనను బీసీసీఐ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ తనను సంప్రదించినా.. బెదిరించిన జర్నలిస్టు పేరును బీసీసీఐకి చెప్పదలుచుకోలేదని వివరించాడు.
తాను ఒకరి కెరీర్ నాశనం చేసే టైపు కాదని.. సదరు జర్నలిస్టు కెరీర్ నాశనం చేసే ఉద్దేశం తనకు లేదని సాహా తెలిపాడు. జర్నలిస్టుల్లో కూడా బెదిరించేవారు ఉన్నారని చెప్పేందుకే తాను స్క్రీన్ షాట్స్ బయటపెట్టానని .. మిగతా క్రికెటర్లకు ఇలాంటి సందేశాలు రాకూడదనే తన అభిమతమని పేర్కొన్నాడు. ఇలా బెదిరించడం మంచిది కాదని.. ఆ వ్యక్తి తప్పు చేశాడనే విషయం బయటపెట్టడానికి తాను ఇలా చేశానని సాహా అన్నాడు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.. సాహాతో మాట్లాడతామని వెల్లడించారు. సాహాను బెదిరించిన జర్నలిస్టు ఎవరో తాము కనుక్కుంటామని తెలిపారు. అయితే బీసీసీఐ అంతర్గత విషయాలను సైతం బయటపెడుతున్న సాహా.. జర్నలిస్టు పేరును ఎందుకు దాస్తున్నాడో విడ్డూరంగా అనిపిస్తోంది.