Team India: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే తాము ర్యాంకులను పెద్దగా పట్టించుకోబోమని.. మైదానంలో ఎలా రాణించాలనేదానిపైనే చర్చిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చివరి వన్డేలో తాను సెంచరీ చేయడం సంతోషంగా ఉందని.. కొంతకాలంగా రాణిస్తున్న తనకు ఈ సెంచరీ అదనపు మైలురాయి లాంటిదని తెలిపాడు. బోర్డుపై పరుగులు ఉన్నా ఇండోర్ లాంటి పిచ్‌పై ఎంతటి లక్ష్యం ఉన్నా సరిపోదని.. కానీ తాము ప్రణాళికలకు తగ్గట్లు ఆడి రాణించామని రోహిత్ చెప్పాడు. ప్రణాళికలకు తగ్గట్లు రాణించడం వన్డే క్రికెట్‌లో చాలా ముఖ్యమని.. తాము వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంతోనే గత 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించామని పేర్కొన్నాడు.
Read Also: Uttar Pradesh: ఇద్దరు అమ్మాయిల ప్రేమ.. లింగమార్పిడి.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..?
సిరాజ్, షమీ లేకుండా రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నామని.. అందుకే చివరి వన్డేలో చాహల్, ఉమ్రాన్ మాలిక్‌లను తుది జట్టులోకి తీసుకుని తీవ్ర ఒత్తిడిలో ఎలా రాణిస్తారో పరీక్షించాలని భావించామని రోహిత్ వెల్లడించాడు. చాలా రోజులుగా శార్దూల్ ఠాకూర్ సత్తా చాటుతున్నాడని.. జట్టులో అతడిని అందరూ మెజిషియన్ అంటారని రోహిత్ అన్నాడు. అవసరమైనప్పుడల్లా శార్దూల్ బ్యాట్, బంతితో మెరుస్తాడని.. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా చాలా నాణ్యమైన జట్టు అని.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ జట్టుపై గెలవడం అంత సులువు కాదన్నాడు. కానీ తాము పైచేయి సాధిస్తామన్న నమ్మకం ఉందని రోహిత్ స్పష్టం చేశాడు.