ఐపీఎల్ వేలంపై టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం ప్రక్రియను చూస్తే సంతలో పశువులను కొనుగోలు చేస్తున్న భావన కలిగిందని ఊతప్ప వ్యాఖ్యానించాడు. వస్తువుల కోసం పోటీపడుతున్నట్టుగా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయని అభిప్రాయపడ్డాడు. వేలంలో ఓ ఆటగాడిని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే ఒకే కానీ.. ఎవరూ కొనకపోతే అతడి పరిస్థితి ఎంత బాధాకరమో ఎవరూ ఊహించలేరని ఉతప్ప ఆవేదన వ్యక్తం చేశాడు.
వేలం జరిగిన తీరు చూస్తే.. క్రికెటర్లు కూడా మనుషులే అనే విషయాన్ని ఫ్రాంచైజీలు విస్మరించినట్టుగా అనిపించిందని రాబిన్ ఉతప్ప తెలిపాడు. భారత్‌లో తప్ప ఇలా ఆటగాళ్ల వేలం ప్రపంచంలో ఎక్కడా జరగడం లేదని పేర్కొన్నాడు. వేలం నిర్వహించే బదులు డ్రాఫ్ట్ పద్ధతి అమలు చేస్తే బాగుంటుందని ఉతప్ప సూచించాడు. కాగా గత ఏడాది రాబిన్ ఉతప్ప చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడాడు. అంతకుముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు.