2031వ ఏడాది వరకు జరగనున్న 8 ఐసీసీ టోర్నీలను ఏ ఏ దేశాలు నిర్వహిస్తాయి అనేది నిన్న ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అందులో 2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ హక్కులు పాకిస్థాన్ కు ఇచ్చింది ఐసీసీ. దాంతో ఈ నిర్ణయం పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ చివరిసారిగా 1996లో ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించారు.
అయితే మాకు ఒక ప్రధాన ఈవెంట్ ను కేటాయించడం ద్వారా… ఐసీసీ మా నిర్వహణ, కార్యాచరణ, సామర్థ్యాలు మరియు నైపుణ్యాల పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది అని రమీజ్ రాజా తెలిపారు. ఇది మా దగ్గర ఉన్న క్రికెట్ అభిమానులకు ఒక వరం అవుతుంది. వారు ఆరాధించే ఆటగాళ్లను దగ్గర నుండి చూసే అవకాశం కలుగుతుంది అని చెప్పాడు. అలాగే ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న పాకిస్థాన్ 2025 ఫిబ్రవరిలో జరగనున్న ఈ టోర్నమెంట్‌ను మూడు వేదికలలో నిర్వహిస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిన్ననే ప్రకటించింది.