భారత మాజీ కెప్టెన్, ప్రపంచ గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు నేడు (జనవరి 11). ఈరోజుతో ఆయనకు 53 ఏళ్లు నిండాయి. ద్రవిడ్ తన టెక్నిక్, సహనం, క్లాసిక్ బ్యాటింగ్ కారణంగా ‘ది వాల్’గా బిరుదు అందుకున్నారు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. ద్రవిడ్‌ను అవుట్ చేయడం బౌలర్లు తలకు మించిన భారంగా ఉండేది. ఆటగాడిగానే కాదు.. కోచ్‌గా కూడా సక్సెస్ అయ్యారు. భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఆటగాడిగా ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొట్టలేని అనేక రికార్డులను సృష్టించారు. అందులో ఐదు రికార్డులను పరిశీలిద్దాం.
# టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు (వికెట్ కీపర్లు కాకుండా) పట్టిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. 163 టెస్ట్ మ్యాచ్‌ల్లో 209 క్యాచ్‌లు అందుకున్నారు. ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ 134 టెస్ట్ మ్యాచ్‌ల్లో 135 క్యాచ్‌లతో రెండవ స్థానంలో ఉన్నారు.
# వరుసగా 120 వన్డే ఇన్నింగ్స్‌లలో డకౌట్ కాని తొలి బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్. న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రో 119 ఇన్నింగ్స్‌లతో రెండవ స్థానంలో ఉన్నారు.
# రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 173 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. 2000 జనవరి 10 నుంచి 2004 ఫిబ్రవరి 6 మధ్య ఈ ఘనతను సాధించారు. సచిన్ టెండూల్కర్ 136 ఇన్నింగ్స్‌లతో రెండవ స్థానంలో ఉన్నారు.
# టెస్ట్ క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్ మొత్తం 44,152 నిమిషాలు క్రీజులో గడిపారు. ఇది టెస్ట్ ఫార్మాట్‌లో ఓ క్రికెటర్ గడిపిన అత్యధిక సమయం.
# రాహుల్ ద్రవిడ్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 31,258 బంతులు ఎదుర్కొన్నారు. ఈ రికార్డు ఏ బ్యాటర్ బద్దలు కొట్టే అవకాశం లేదు.
1973 జనవరి 11న ఇండోర్‌లో జన్మించిన రాహుల్ ద్రవిడ్.. భారత్ తరఫున 164 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో 13,288 పరుగులు చేశారు. టెస్ట్ క్రికెట్‌లో అతని సగటు 52.31. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ద్రవిడ్ 344 మ్యాచ్‌లు ఆడి.. 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలతో 10,889 పరుగులు బాదారు. టెస్ట్, వన్డే మ్యాచ్‌లలో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో ద్రవిడ్ ఒకరు. ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ పలు చారిత్రాత్మక మైలురాళ్లను సాధించింది. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని భారత్ సాధించింది. 2006-07 పర్యటనలో జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో భారతదేశం 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. 2007లో ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ 21 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.