Pakistan Cricket Board: పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనే విషయంపై వివాదం నడుస్తోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. ఇదే జరిగితే ఆసియా కప్ కళ తప్పుతుంది. దీంతో పాకిస్థాన్ బోర్డు బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ తమ దేశానికి వచ్చి ఆసియా కప్ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు దూరంగా ఉంటామని గతంలోనే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహిస్తే బాగుంటుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు బీసీసీఐ సూచిస్తోంది. ఈ మేరకు ఆసియా కప్ ఆతిథ్యాన్ని పాకిస్థాన్ నుంచి మరొక వేదికకు మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్పందించారు. ఆసియా కప్ వేదిక మారిస్తే తాము టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను ఇవ్వమని తాము కోరుకోవడం లేదని.. కానీ తమకు ఆ హక్కులు పారదర్శకంగా వచ్చాయని.. భారత్ రాకపోతే అది వారి ఇష్టమని తెలిపాడు. కానీ ఆసియా కప్ వేదికను మారిస్తే మాత్రం తాము ఈ టోర్నీలో పాల్గొనేది లేదని రమీజ్ రాజా స్పష్టం చేశారు. దీంతో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఈ వ్యవహారం తయారైంది. పాకిస్థాన్‌లో ఆసియా కప్ నిర్వహిస్తే టీమిండియా ఆడనంటోంది.. తటస్థ వేదికలో నిర్వహిస్తే పాకిస్థాన్ ఆడనంటోంది. మొత్తానికి ఈ వ్యవహారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ మెడకు చుట్టుకుంది.
Read Also: Premarital Affairs: పెళ్లికి ముందు సెక్స్ చేశారో ఇక అంతే.. ఆ దేశంలో భారీ జరిమానా, జైలు శిక్ష
పాకిస్థాన్ చివరగా 2009 ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చిందవి. అప్పుడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి సమీపంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరగడంతో అప్పటి నుంచి ఆ దేశంలో ఇతర జట్లు పర్యటించడానికి వెనుకాడాయి. చాలా కాలం తర్వాత 2015లో జింబాబ్వే జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం పర్యటించింది. అనంతరం 2017లో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ ఆడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా కూడా పర్యటించింది. తాజాగా ఇంగ్లండ్ జట్టు కూడా పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.