Pakistan Opener Abdullah Shafique Creates World Record: శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాక్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే! ఈ విజయంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. చివరివరకు క్రీజులో నిలిచి, తన జట్టుని గెలిపించాడు. ఈ క్రమంలో అతడు తన పేరిట రెండు అరుదైన రికార్డుల్ని లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో షఫీక్ ఏకంగా 524 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు. దీంతో, టెస్ట్ క్రికెట్ చరిత్రలో చేజింగ్ సమయంలో ఎక్కువసేపు క్రీజులో నిలిచిన తొలి బ్యాట్స్మన్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా పేరిట ఉండేది. 1998లో జింబాబ్వేపై చేజింగ్‌లో అతడు 460 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు 524 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి, ఆ రికార్డ్‌ని తుడిచిపెట్టేశాడు షఫీక్. అంతేకాదు.. అత్యధిక బంతుల్ని ఎదుర్కొని, 93 ఏళ్ల తర్వాత ఓ అరుదైన ఫీట్ సాధించాడు షఫీక్. 1928-29లో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ సట్‌క్లిప్ 462 బంతులు ఎదుర్కొని 135 పరుగులు సాధించాడు. తన జట్టుని గెలిపించాడు.
ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 408 బంతులు ఎదుర్కొన్న షఫీక్.. ఛేజింగ్‌లో అన్ని బంతులు ఆడి, జట్టుని విజయతీరాలకు చేర్చిన రెండో బ్యాట్స్మన్‌గా నిలిచాడు. దాదాపు 93 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డును షఫీక్ సాధించడం విశేషం. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో చూసుకుంటే.. నాలుగో ఇన్నింగ్స్‌లో 400 పైగా బంతులను ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజాం ఉన్నారు.