Site icon NTV Telugu

T20 World Cup: పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తుందా? పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ స్పందన..

Pak

Pak

T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ(ICC) షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో టీ20 వరల్డ్ కప్-2026(T20 World Cup 2026) ఆడేందుకు నిరాకరించినందుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ నుంచి తమ వేదికను శ్రీలంకకు మార్చాలని, లేదంటే టోర్నీలో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీసీ) చెప్పింది. ఈ నేపథ్యంలో, ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అవుట్ అయిన నేపథ్యంలో, పాకిస్తాన్ టోర్నీలో పాల్గొంటుందా? అనే దానిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌పై ఐసీసీ వ్యవహరించిన తీరును విమర్శించారు.

Read Also: CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం గంట పాటు నిలిచిన రైళ్లు..

బంగ్లాదేశ్ నిష్క్రమణపై నఖ్వీ స్పందిస్తూ.. ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అనుమతించాలని నఖ్వీ అన్నారు. “బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశంలో కూడా నేను ఇదే విషయం చెప్పాను. మీరు ద్వంద్వ ప్రమాణాలను పాటించలేరు, ఒక దేశం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ మరో దేశం విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదు. అందుకే బంగ్లాదేశ్‌కు అన్యాయం జరుగుతోందని, ఏదేమైనా వారిని ప్రపంచ కప్‌లో ఆడేందుకు అనుమతించాలని మేము వైఖరి తీసుకున్నాము. వారు ఒక ప్రధాన వాటాదారులు, వారికి ఈ అన్యాయం జరగకూడదు’’ అని అన్నారు.

బంగ్లాదేశ్ లాగే పాకిస్తాన్ కూడా టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే సూచనల్ని పాటిస్తామని చెప్పారు. పాక్ ప్రధాని పాకిస్తాన్‌లో లేరని, ఆయన వచ్చాక తుది నిర్ణయాన్ని చెబుతామని, తాము ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తామని, ఐసీసీని కాదు అని చెప్పారు. భారత్‌లో జరిగే ఈ ఐసీసీ ఈవెంట్‌ల విషయానికి వస్తే పాకిస్తాన్ హైబ్రీడ్ మోడల్‌లో ఆడుతోంది. దాని మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగనున్నాయి. బంగ్లాదేశ్‌కు కూడా ఇలాంటి సహాయమే చేయాలని చెప్పారు.

Exit mobile version