ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెటర్లు పెళ్లిళ్లు చేసుకుని ఈ మెగా లీగ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ తన భారత ప్రేయసిని పెళ్లి చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ కూడా అతడి బాటలోనే నడిచాడు. 33 ఏళ్ల వయసులో తాను చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయాను సౌథీ పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు షేర్ చేశాడు.
అయితే చాలాకాలంగా సౌథీ, బ్రయా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కొత్త దంపతులకు 2017లో ఇండీ మే సౌతీ, 2019లో స్లోయానే అవా సౌతీ జన్మించారు. ఇప్పుడు సౌతీ, బ్రయా జంట తమ రిలేషన్‌లో మరో అడుగు ముందుకేసి పెళ్లి చేసుకుంది. కాగా 2006లో ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌తో పాటు కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో 2008లో అండర్-19 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో టిమ్ సౌథీ సభ్యుడిగా ఉన్నాడు. న్యూజిలాండ్ తరపున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 5 హాఫ్ సెంచరీలతో 1769 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరఫున ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్లకు టిమ్ సౌథీని కొనుగోలు చేసింది.