Team India: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నాడు. అయినా కేఎల్ రాహుల్ ఆటను అచ్చుగుద్దినట్లు ఓ ఆటగాడు దింపేశాడని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. అతడు ఎవరో కాదు శుభ్‌మన్ గిల్. శ్రీలంకతో టీ20 సిరీస్‌తోనే గిల్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే అతడు టీ20 తరహాలో ఆడకుండా జిడ్డు బ్యాటింగ్ చేశాడని నెటిజన్‌లు మండిపడుతున్నారు. వన్డే, టెస్టుల్లో రాణిస్తున్న శుభ్‌మన్ గిల్‌ను టీ20ల్లోకి తీసుకుంటే చెత్త బ్యాటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20ల్లో గిల్ ఘోరంగా విఫలమయ్యాడని.. నిర్ణయాత్మక మూడో టీ20లో కూడా జిడ్డు బ్యాటింగ్ చేసి విసుగు తెప్పించాడని భావిస్తున్నారు. తను ఆడుతున్నది టీ20 మ్యాచ్ అనే విషయం గిల్ మరిచిపోయాడని ఆరోపిస్తున్నారు.
Read Also: India: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇండియా..
బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న రాజ్‌కోట్ పిచ్‌పై ఆడుతూ.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ను గిల్ మెయిడెన్ ఆడాడని నెటిజన్‌లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. దీంతో కేఎల్ రాహుల్ వారసుడు అంటూ అభివర్ణిస్తున్నారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ కూడా నెమ్మదిగా ఆడి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు అదే తరహాలో గిల్ బ్యాటింగ్ చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. దీంతో కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌కు పనికిరాడని చెప్పి అతడి వారసుడిని తీసుకున్నారా అంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. కాగా రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్, సూర్యకుమార్ అద్భుతమైన ఆట, అక్షర్ పటేల్ నిలకడ కలిసి శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమిండియా విజయాన్ని కట్టబెట్టాయని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.