Netherlands Won Against South Africa In T20 World Cup: సౌతాఫ్రికా జట్టు దురదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుందని మరోసారి రుజువైంది. తాడోపేడో తేల్చుకోవాల్సిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ఈ జట్టు చెత్త ప్రదర్శన కనబర్చింది. చిన్న జట్టు అయిన నెదర్లాండ్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో.. సెమీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభమైన కొత్తలో.. విధ్వంసకరమైన జట్టుగా అవతరించింది. బంగ్లాదేశ్‌పై ఏకంగా 100 పరుగులకు పైగా తేడాతో గెలవడంతో.. ఈసారి సౌతాఫ్రికాకి తిరుగు ఉండదని అంతా భావించారు. కానీ.. క్రమంగా ఈ జట్టు డీలా పడుతూ వచ్చింది. ఇప్పుడు నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. మెరుపులు మెరిపించే బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు కుదిర్చిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా జట్టు చేధించలేకపోయింది. దీంతో.. ఈ జట్టు సెమీస్ నుంచి నిష్క్రమించింది.
తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లందరూ బాగా రాణించడంతో.. ఈ జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. చివర్లో కాలిన్ అక్కర్‌మన్ సౌతాఫ్రికా బౌలర్లపై తాండవం చేశాడు. 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 41 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ 2 వికెట్లు తీయగా.. నోర్ట్యే, మార్క్‌రమ్ చెరో వికెట్ తీశారు. ఇక 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మొదటి నుంచే తడబడింది. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి ఒకదాని తర్వాత మరొక వికెట్ కోల్పోతూ వచ్చింది. ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేదు. రుస్సో ఒక్కడే 25 పరుగులతో జట్టులో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. దీన్ని బట్టి.. నెదర్లాండ్ బౌలర్లు ఎంత కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారో అర్థం చేసుకోవచ్చు. నెదర్లాండ్స్ జట్టు ఇంటికి పోతూపోతూ.. తనతో పాటు సౌతాఫ్రికాని కూడా ఇంటిదారి పట్టించింది.
సౌతాఫ్రికా ఇంటి దారి పట్టడంతో.. భారత్ అధికారికంగా సెమీ ఫైనల్స్‌కి చేరింది. ఇక జింబాబ్వేతో జరిగే మ్యాచ్ ఫలితంతో ఎలాంటి సంబంధం ఉండదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు సెమీస్ ఆశలు సజీవం అయ్యాయి. ఆ రెండు జట్లకి ఈరోజు మ్యాచ్ ఉంది. ఏ జట్టు గెలుస్తుందో.. అది సెమీస్‌కి చేరుకుంటుంది. మరి, ఈ కీలకమైన పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.