ఐపీఎల్ 2022కు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. మరో 50 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ భావిస్తోంది. అయితే టోర్నీ ప్రారంభం కాకముందే ఆ జట్టుకు పెద్ద దెబ్బ తగిలిందని తెలుస్తోంది. కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడని సమాచారం. ఎందుకంటే అతడు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడు.
మ్యాక్స్‌వెల్ తమిళ సంతతికి చిందన యువతిని త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మార్చి నెలాఖరులో అతడి వివాహం జరిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్ పాకిస్థాన్ పర్యటనతో పాటు ఐపీఎల్‌కు దూరం అవుతాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇప్పటికే డివిలియర్స్ ఆటకు దూరం కాగా ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనపడింది. ఇప్పుడు మ్యాక్స్‌వెల్ కూడా దూరమైతే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలహీనపడే అవకాశముంది. కాగా పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా పర్యటన కారణంగా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టాయినీస్, కమిన్స్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు.