Kolkata Knight Riders 10 Overs Score Against CSK: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్.. లక్ష్య ఛేధనలో చెమటోడుస్తోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 78 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం ఛేధించనంత పెద్దదైతే కాదు. సునాయాసంగా ఛేధించొచ్చు. అయితే.. సీఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లను కట్టడి చేసి, వికెట్లు తీస్తున్నారు. ఆల్రెడీ కేకేఆర్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ప్రస్తుతం రింకూ సింగ్, నితీష్ రానా నిలకడగా రాణిస్తున్నారు. ఒకవేళ ఇదే ఆటతీరు కొనసాగిస్తే.. లక్ష్యాన్ని ఛేధించడం కేకేఆర్‌కు పెద్ద కష్టమేమీ కాదు.
లక్ష్య ఛేధనలో భాగంగా.. కేకేఆర్ జట్టుకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లో విధ్వంసకర బ్యాటర్ రహమానుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్ రెండు ఫోర్లు కొట్టి మంచి జోష్ నింపాడు కానీ, అదే ఊపులో అతగాడు క్యాచ్ ఔట్ అయ్యాడు. జేసన్ రాయ్ చూడ్డానికి కసి మీద కనిపించాడు కానీ, అతడు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలకడగా రాణించలేకపోయాడు. దీపక్ చహార్ బౌలింగ్‌లో స్లో బాల్‌కి టెంప్ట్ అయి, ఫీల్డర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన నితీశ్ రానా, రింకూ సింగ్.. ఆచితూచి ఆడుతున్నారు. కష్టాల్లో ఉన్న తమ జట్టును గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి.. వీళ్లిద్దరు ఎక్కడివరకు రాణించగలరు? తమ జట్టుని విజయతీరాలకు చేర్చుతారా? లేదా? అన్నది వేచి చూడాలి.