టీమిండియాతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్ కోసం భారత్ ప్రయాణమయ్యారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. అయితే వీసా ఆలస్యం కారణంగా ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇండియాకు వచ్చే ఫ్లైట్ మిస్సయ్యాడు. అందువల్ల అతడు భారత్‌కు ఆలస్యంగా చేరుకోనున్నాడు. దీంతో నిరాశ చెందిన ఖవాజా..సోషల్ మీడియాలో ఒక మీమ్ పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఓ షోకు సంబంధించిన ఫోటో పోస్టు చేసి..భారత వీసా కోసం నేనూ ఇలాగే ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా ప్రారంభంకానుంది. దీనికోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు మంగళవారం భారత్ చేరుకున్నారు. తన వీసా బుధవారం వస్తే గురువారం భారత్‌కు చేరుకోవచ్చని ఖవాజా ఆశిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి అతడికి వీసా అనుమతి లభించింది. అయితే అతడికి వీసా ఆలస్యమవడం ఇదేం తొలిసారి కాదు. 2011లో ఐపీఎల్ సమయంలోనూ అతడు ఇదే తరహా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. భారత అధికారుల చొరవతో ఆ సమస్య పరిష్కారమైంది. ఆస్ట్రేలియా జట్టులో ఖవాజా కీలక ఆటగాడు. గతేడాది 11 టెస్టు మ్యాచులు ఆడిన అతడు 4 శతకాలు, 5 అర్ధ శతకాలు బాది 1,080 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఉత్తమ టెస్టు ఆటగాడిగా అతడు సిడ్నీలో సోమవారం షేన్ వార్న్ అవార్డు అందుకున్నాడు.
Also Read: INDvsNZ T20: ఒక్క మ్యాచ్..పది రికార్డులు బ్రేక్