టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో టెండూల్కర్ 15,921 రన్స్ చేశాడు. వాంఖడే స్టేడియంలో సచిన్ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే 10,806 పరుగులతో ఉన్నాడు. సచిన్ కంటే 5,000 పరుగులు వెనుకబడి ఉన్న మహేలా.. 10 నెలల తర్వాత రిటైర్ అయ్యాడు. ఆ సమయంలో క్రికెట్ దిగ్గజం టెస్ట్ రికార్డుకు ఏ ప్లేయర్ కూడా దగ్గరగా లేడు. దాంతో మాస్టర్ బ్లాస్టర్ రికార్డు బద్దలు కొట్టడం ఇక అసాధ్యమే అనుకున్నారు. కానీ ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు బద్దలు కొట్టేందుకు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ చేరువయ్యాడు.
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అయ్యే సమయానికి జో రూట్ 11 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు. అప్పుడు తొలి యాషెస్ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో 763 పరుగులు మాత్రమే చేసిన రూట్.. టెండూల్కర్ కంటే 15,000 కంటే ఎక్కువ పరుగుల వెనుకబడి ఉన్నాడు. అప్పట్లో టెస్ట్ క్రికెట్ రాజును అధిగమించడానికి తీవ్రమైన పోటీదారుగా రూట్ మారుతాడని ఎవరూ ఊహించి ఉండరు. అయితే టెండూల్కర్ నాణ్యమైన, పదును కలిగిన బౌలర్లను ఎదుర్కొన్నాడు. మూడు తరాల పాటు బ్యాటింగ్ చేశాడు. తన ఆటను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నాడు. రూట్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు కానీ.. అప్పటి మేటి బౌలర్లు ఇప్పుడు లేరనే చెప్పాలి. ఏదేమైనా టెస్ట్ క్రికెట్‌లో రన్స్ చేయడం అంత సులువు కాదు.
Also Read: Nepal T20 World Cup Squad: ఐపీఎల్ స్టార్‌కు చోటు.. టీ20 వరల్డ్ కప్‌కు నేపాల్ జట్టు ఇదే!
జోట్ రూట్ నిస్సందేహంగా ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మన్. 2013-2020 మధ్య రూట్ 17 సెంచరీలు చేశాడు. ఆ తర్వాతి ఐదు సంవత్సరాలలో 24 సెంచరీలు చేశాడు. 2021 నుంచి అతడి పరుగుల వరద పారిస్తున్నాడు. 24 సెంచరీలతో సహా 56.09 సగటుతో 6114 పరుగులు చేశాడు. ఇదే ఫామ్ కొనసాగితే.. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడానికి అతనికి ఇంకా 35 లేదా అంతకంటే తక్కువ టెస్ట్ ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం కానున్నాయి. ప్రస్తుతం సచిన్ కంటే కేవలం 1,984 పరుగుల వెనుకబడి ఉన్నాడు. 35 ఏళ్ల రూట్ ఇంకా 3-4 సంవత్సరాలు ఆడనున్నాడు. ప్రస్తుతం రూట్ మిషన్ ‘15921’. అతడికి రోడ్ మ్యాప్ కూడా సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ టెస్టులు ఆడనుంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇంగ్లండ్ ఇంకా 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 2027 నాటికి లిటిల్ మాస్టర్‌ను రూట్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.