Ishan Kishan Scored Century In Ranji Trophy Against Kerala: భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ద్విశతకం (210) బాదిన విషయం అందరికీ తెలిసిందే! క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు.. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన వరల్డ్ రికార్డ్‌ని నమోదు చేశాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. ఆ రికార్డ్‌ని ఇషాన్ పాతాళానికి తొక్కేశాడు. అంతేకాదండోయ్.. వన్డేల్లో ఒక్క సెంచరీ నమోదు చేయకుండానే, నేరుగా ద్విశతకం చేసిన ఏకైక క్రికెటర్‌గానూ ఇషాన్ చరిత్రపుటలకెక్కాడు.
అదే జోరుని ఇప్పుడు రంజీ ట్రోఫీలోనూ ఇషాన్ కొనసాగిస్తున్నాడు. ఆ డబుల్ సెంచరీ చేసి వారం రోజులు కాకుండా.. రంజీలో శతకం బాదేశాడు. జార్ఖండ్, కేరళ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సహకారంతో 132 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో అతనికి ఇది ఆరో శతకం. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 114 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయినప్పుడు.. ఇషాన్ క్రీజులోకి దిగాడు. సౌరభ్ తివారీ (97)తో కలిసి.. స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. వీళ్లిద్దరు కలిసి.. ఐదో వికెట్‌కి 200కి పైగా భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లిద్దరు ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ల కారణంగానే.. కేరళ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 340 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జార్ఖండ్ ఆలౌట్ అయ్యాక బరిలోకి దిగిన కేరళ.. రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 60 పరుగులు చేసింది.