ఈమధ్య సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు తరచూ విశ్రాంతినిస్తున్నారు. తీరిక లేకుండా ఆడుతున్నారనో లేక ఫామ్ లేరన్న కారణాన్ని చూపి, సీనియర్స్‌కు రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు జులై 22 నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. విశ్రాంతి ఇస్తే, ఏ ఆటగాడూ ఫామ్‌లోకి తిరిగి రాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలాకాలం నుంచి ఫామ్‌లేమీతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే! ఎన్నో అవకాశాలు వచ్చినా సద్వినియోగ పరచుకోలేదు. పేలవ ప్రదర్శనలతోనే వాళ్లు నిరాశపరుస్తూ వస్తున్నారు. ఇలాంటప్పుడు కఠోర శ్రమ చేస్తే గానీ ఫామ్‌లోకి రావడం కష్టం. అలా కాకుండా వారికి విండీస్ టూర్‌కు రెస్ట్ ఇవ్వడంతో.. వాళ్ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్షంగా వారిని పక్కన పెట్టడం ఏమాత్రం సబబు కాదని ఆ ట్వీట్‌లో తన అసహనం వ్యక్తం చేశాడు. అతడు కోహ్లీ, రోహిత్‌లను ఉద్దేశించే ఆ ట్వీట్ చేశాడని గ్రహిస్తున్న వారు.. అతని వాదనతో ఏకీభవిస్తున్నారు. ఇర్ఫాన్ ట్వీట్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
కాగా.. ఈ నెల 22వ తేదీ నుంచి వెస్ట్ ఇండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యుల టీమిండియాను సెలెక్టర్లు జులై 6న ప్రకటించారు. ఈ జట్టుకు సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ కెప్టన్‌గానూ, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించనున్నారు. ఇదిలావుండగా.. ఈమధ్య సిరీస్‌కు ఓ కొత్త కెప్టెన్‌ను ప్రకటించడంపై అభిమానులు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టర్లు తరచూ కెప్టెన్లను మారుస్తూ.. టీమిండియాను నాశనం చేస్తున్నారని ఫైరవుతున్నారు. ఒకే నెలలో ఒకే జట్టుకు నలుగురు కెప్టెన్లను మార్చడం ఏంటని నిలదీస్తున్నారు.