Pat Cummins on SRH Defeat vs RCB: అటాకింగ్ స్టైల్ తమ బలం అని, అయితే అది ప్రతి మ్యాచ్‌లో కుదరదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈ రోజు తమకు అనుకూలంగా లేదని, వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందన్నాడు. టీ20 క్రికెట్‌లో ప్రతి మ్యాచ్ గెలవలేం అని, ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించొద్దని కమిన్స్ పేర్కొన్నాడు. హైదరాబాద్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 35 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ఈ రోజు మాకు కలిసిరాలేదు. బంతితో రాణించకపోవడం, ఛేదనలో త్వరగా వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ముందుగా బ్యాటింగ్ చేస్తే వర్కౌట్ అయ్యేది. గత కొన్ని విజయాలకు ముందు.. మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకునేవాళ్లం. ఇప్పుడు బ్యాటింగ్ చేయాలని చూస్తున్నాం. ఇప్పుడే డేనియల్ వెటోరి మాట్లాడాడు. అందరూ బాగా ఆడారని చెప్పాడు’ అని అన్నాడు.
Also Read: Virat Kohli: హైదరాబాద్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన విరాట్ కోహ్లీ!
‘అటాకింగ్ స్టైల్ మా బలం. అయితే అది ప్రతిసారీ పని చేయదు. తొలి మ్యాచ్‌లో ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. తిరిగి పుంజుకొని భారీ స్కోర్లు నమోదు చేశాం. ఇప్పటికీ అటాకింగ్ స్టైల్ మా బ్యాటర్ల ముందున్న మార్గం అని నేను అనుకుంటున్నాను. మా ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. టీ20 క్రికెట్‌లో ప్రతి మ్యాచ్ గెలవలేం. ఓటమిపై గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. తప్పులు సరిదిద్దుకొని వచ్చే మ్యాచ్‌లో బరిలోకి దిగుతాం’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.