Sanju Samson Fined Rs 12 Lakh Due To Slow Over Rate in RR vs GT Match: ఐపీఎల్ 2024లో రాజస్తాన్ రాయల్స్ తొలి ఓటమి చవిచూసింది. రాజస్తాన్ వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. సంజూ సేనను వారి తమ సొంత మైదానంలో చివరి బంతికి ఓడించి.. ఊహించని విజయాన్ని గుజరాత్ అందుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించిన గుజరాత్ గెలుపు ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. మరోవైపు ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగిలింది.
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌కు ఐపీఎల్ అధికారులు జరిమానా విధించారు. గుజరాత్ టైటాన్స్‌పై స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు రాజస్థాన్ కెప్టెన్‌కు జరిమానా పడింది. రాజస్తాన్ టీమ్ నిర్ణీత సమయం కంటే 5 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ మొదటిసారి స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడంతో.. శాంసన్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్‌లో ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్‌కు జరిమానా పడిన విషయం తెలిసిందే.
Also Read: Love Guru Review: విజయ్ ఆంటోనీ ‘లవ్ గురు’ రివ్యూ!
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఓ సీజన్‌లో మొదటిసారి స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే టీమ్ కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా పడుతుంది. రెండోసారి రిపీట్ అయితే కెప్టెన్‌కు రూ.24 లక్షలు ఫైన్, జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి ఇదే పునరావృతమైతే కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించబడుతుంది. అంతేకాకుండా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా విధించబడుతుంది.