Mohammed Shami Fires on LSG Owner Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ కెప్టెన్‌పై కెమెరాల ముందే అరవడం సంస్కారం కాదన్నాడు. ప్రతి క్రీడాకారుడికి గౌరవం ఉంటుందని, కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నాడు. కెప్టెన్‌తో మాట్లాడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, మైదానం అందుకు సరైన వేదిక కాదని షమీ మండిపడ్డాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఘోర ఓటమి అనంతరం లక్నో యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రాహుల్‌పై అందరి ముందే సీరియస్ అయ్యాడు.
క్రిక్‌బజ్‌తో మహ్మద్ షమీ మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లకు గౌరవం ఉంటుంది. ఓ యజమానిగా మీరు గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారు. చాలా మంది మిమ్మల్ని చూస్తూ.. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీ లాంటి వ్యక్తి కెమెరాల ముందు అరవడం సరికాదు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. మీరు కెప్టెన్‌తో మాట్లాడనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో లేదా హోటల్లో మాట్లాడి ఉండవచ్చు. కానీ మైదానంలో అరవడం అనవసరం. ఇలా చేయడం ద్వారా మీరు ఎర్రకోటలో జెండాను ఎగురవేసినట్లు ఫీల్ కావొద్దు’ అని అన్నాడు.
Also Read: Ruturaj Gaikwad: 11 మ్యాచ్‌లలో 10 ఓడాడు.. మరి ఈరోజు రుతురాజ్ ఏం చేస్తాడో!
‘కేఎల్ రాహుల్ ఆటగాడే కాదు కెప్టెన్ కూడా. ఇది జట్టుగా ఆడే ఆట. మ్యాచ్ అన్నాక ప్రణాళికలు ఒక్కోసారి విజయవంతం కాకపోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఆటలో ఏదైనా జరగొచ్చు. మంచి లేదా చెడు రోజులు ఉంటాయి. కానీ ప్రతి క్రీడాకారుడికి గౌరవం ఉంటుంది. మాట్లాడటానికి కూడా ఓ మార్గం ఉంటుంది. మీరు మైదానంలో అరచి.. తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్లేలా చేశారు’ అని మహ్మద్ షమీ మండిపడ్డాడు. గాయం కారణంగా షమీ ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.