Mitchell Starc React on IPL 2024 Price: ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత మొత్తం అవసరమా?, ఒక్కో బంతికి అన్ని లక్షలా? అంటూ అటు కేకేఆర్‌పై.. ఇటు స్టార్క్‌పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్ స్టేజ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. 12 మ్యాచుల్లో కేవలం 12 వికెట్స్ మాత్రమే తీశాడు. కొన్ని మ్యాచ్‌లలో అయితే భారీగానే పరుగులు ఇచ్చుకున్నాడు. అయ్యితే కీలక నాకౌట్‌లలో మాత్రం రెచ్చిపోయాడు. రెండు మ్యాచుల్లోనే 5 వికెట్లు తీశాడు. అద్భుత బౌలింగ్‌తో ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కైవసం చేసుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న సందర్భంగా తన పారితోషికంపై చాలా ట్రోల్స్ వచ్చాయని మిచెల్ స్టార్క్ తెలిపాడు. నాకౌట్‌లలో రాణించడంతో సంతోషంగా ఉందన్నాడు. ‘కోల్‌కతాకు ఇదొక అద్భుతమైన సీజన్. ఫైనల్‌లో రెండు అత్యుత్తమ టీమ్స్ తలపడ్డాయి. ఐపీఎల్ 2024 ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్ బాగా సాగింది. అత్యుత్తమ బ్యాటర్లు, బౌలర్లు మా జట్టులో ఉన్నారు. నిలకడగా ఆడుతో.. ప్రతి ఒక్కరూ జట్టు విజయాల్లో భాగం అయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లో మేం టాస్ ఓడిపోయినప్పటికీ.. బౌలింగ్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం’ అని స్టార్క్ తెలిపాడు.
‘రెండు రోజుల కిందట చెపాక్ పిచ్‌పై జరిగిన మ్యాచ్‌ను గమనించాం. పిచ్ ఎలా స్పందిస్తుందన్న అంశం మాకు అర్థం కాలేదు. దాంతో మ్యాచ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని నిర్ణయించుకున్నాం. శ్రేయస్ అయ్యర్ రూపంలో మాకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. బౌలర్లను, ఫీల్డర్లను ఎలా వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. టోర్నీ ప్రారంభానికి ముందు నా పారితోషికంపై చాలా జోకులు వచ్చాయి. నేను ఐపీఎల్‌లో ఆడి చాలా ఏళ్లయింది. మొదట్లో నాపై భారీగా అంచనాలు ఉండేవి. వాటిని మేనేజ్ చేయగలిగా. విజయంలో నా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. జట్టు విజేతగా నిలవడం కోసం ప్లేయర్లతో పాటు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో ఆడకపోవచ్చు కానీ.. తప్పకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడుతా’ అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.