Please Leave RCB, Kevin Pietersen Suggests Virat Kohli: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కథ ముగిసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్‌సీబీ.. ఎలిమినేటర్‌లో చేతులెత్తేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 741 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విరాట్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. రాయల్స్‌పై ఓటమితో విరాట్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతడి మనస్సులో ఎంత బాధ ఉందో కళ్లల్లో కనిపించింది. అయితే ఐపీఎల్ ట్రోఫీ కోసం తొలి సీజన్ నుంచి ఆర్‌సీబీ తరఫున పోరాడుతున్న కోహ్లీకి.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఓ సూచన చేశాడు.
ఐపీఎల్ ట్రోఫీ సాదించేందుకు విరాట్ కోహ్లీ పూర్తి అర్హుడు అని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. ఎంతో మంది క్రీడా దిగ్గజాలు ఇతర ఫ్రాంచైజీలకు వెళ్లి కీర్తి గడించారని, 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో విరాట్ జాయిన్ అవ్వాలని కేపీ సూచించాడు. స్టార్ స్పోర్ట్స్‌లో పీటర్సన్ మాట్లాడుతూ… ‘ఇతర క్రీడల్లోని గొప్ప ఆటగాళ్లు ఇతర ఫ్రాంచైజీలకు వెళ్లి కీర్తి గడించారు. విరాట్ కోహ్లీ మరోసారి ఆర్‌సీబీని గెలిపించడానికి ప్రయత్నించాడు. ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నా.. ఆర్‌సీబీ మాత్రం మరోసారి ట్రోఫీ సాధించడంలో విఫలమైంది. విరాట్ వలన ఫ్రాంచైజీ బ్రాండ్ పెరుగుతుంది కానీ ట్రోఫీ అందుకోవడానికి విరాట్ అర్హుడు. ఐపీఎల్ టైటిల్‌ను అందుకోవడానికి అతడికి సహాయపడే జట్టులో ఉండాలి’ అని అన్నాడు.
Also Read: Actress Hema: బెంగుళూరు రేవ్‌పార్టీలో కీలక ట్విస్ట్.. నటి హేమ రక్తనమూనాల్లో డ్రగ్స్!
‘విరాట్ కోహ్లీ వెళ్లాల్సిన ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అని నేను అనుకుంటున్నా. విరాట్ ఢిల్లీకి వెళ్లిపోవచ్చు. అప్పుడు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండగలడు. అతనికి ఢిల్లీలో ఇల్లు ఉందని నాకు తెలుసు. కోహ్లీకి కుటుంబం ఉంది. ఢిల్లీకి ఆడితే ఎక్కువ సమయం కుటుంబంతో గడపవచ్చు. విరాట్ ఢిల్లీ కుర్రాడు. అతను ఎందుకు ఢిల్లీకి ఆడకూడదు?. ఢిల్లీ కూడా బెంగళూరులా ట్రోఫీ లేదనే నిరాశలో ఉంది. విరాట్ ఆలోచించే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. బెక్‌హమ్, రొనాల్డో, మెస్సీ, హ్యారీ కేన్ ఫ్రాంచైజీలను విడిచి పెట్టిన వారే’ అని కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. 17 ఎడిషన్లలో ఒకే జట్టు తరపున ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లీనే.