Site icon NTV Telugu

Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్‌ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Wasim Jaffer

Wasim Jaffer

Wasim Jaffer: పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజాం, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే వాదనలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం ఆటతీరుపై టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబర్ నిస్సందేహంగా మంచి ఆటగాడే అయినప్పటికీ, అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం ఏమాత్రం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అనవసర పోలికలే బాబర్ ఫామ్ కోల్పోవడానికి ప్రధాన కారణమని జాఫర్ విశ్లేషించారు. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియా, అక్కడి అభిమానులు బాబర్‌ను అవసరానికి మించి ఎక్కువగా హైప్ చేశారని జాఫర్ పేర్కొన్నారు. టీ20 కెరీర్‌లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు, అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ రెండో అత్యుత్తమ ఆటగాడు. కోహ్లీ అంచెలంచెలుగా ఎదుగుతున్న కొద్దీ, బాబర్ ఫామ్‌లో తగ్గుదల కనిపిస్తోందన్నారు.

“బాబర్ మంచి ఆటగాడు, అందులో సందేహం లేదు. కానీ అతడిని విరాట్ కోహ్లీతో పోల్చడం మొదలుపెట్టి, ‘కింగ్’ అని పిలుస్తూ అతనిపై అనవసర ఒత్తిడిని పెంచారు. ఆ ఒత్తిడి అతడి మనసుపై ప్రభావం చూపింది. విరాట్ కోహ్లీలా ఆడాలని, అతనిలాగే జట్టును నడిపించాలని బాబర్ ప్రయత్నించాడు. కానీ విరాట్ ఈ తరం గొప్ప ఆటగాళ్లలో ఒకడు. విరాట్ ఎప్పటికీ విరాటే. ఈ అతిగా చేసిన ప్రచారమే బాబర్ పతనానికి నాంది పలికింది” అని జాఫర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ వేదికగా పంచుకున్న ఓ వీడియోలో తెలిపారు. అంతేకాదు.. బాబర్‌ ఆజాం కెప్టెన్‌గా రాణించలేకపోయాడని జాఫర్ విమర్శించారు. అనుకున్నంత స్థాయిలో పర్ఫామెన్స్ లేదన్నారు. పాకిస్థాన్ క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం వచ్చినప్పుడు బాబర్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడని అన్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినప్పటికీ, జట్టును నిలకడగా విజయపథంలో నడిపించడంలో, బలమైన జట్టును నిర్మించడంలో బాబర్ విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ప్రస్తుత తరంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన అత్యుత్తమ బ్యాటర్లలో బాబర్ ఒకరని జాఫర్ కొనియాడారు.

Exit mobile version