Australia Former Allrounder David Hussey Says Rinku Singh Will Definitely Play For India In Future: ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లలో రింకూ సింగ్ ఒకడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు.. ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకి తనవంతు కృషి అందిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో.. చివరి 5 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు, అతని వరుసగా ఐదు సిక్సులు బాది తన జట్టుని గెలిపించుకున్నాడు. ఈ మ్యాచ్ తరువాత అతడు ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లోనూ మెరుగ్గా రాణిస్తుండటంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రింకూ సింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ డేవిడ్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో రింకూ సింగ్ ఖచ్చితంగా భారత్ తరపున ఆడుతాడని జోస్యం చెప్పాడు.
స్టార్‌స్పోర్ట్స్ షోలో హస్సీ మాట్లాడుతూ.. ‘‘రింకూ సింగ్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. 2018 నుంచి కేకేఆర్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. క్రమంగా తన ఆటతీరుని మెరుగుపరచుకున్నాడు. కేకేఆర్ సైతం అతనికి మద్దతుగా నిలిచింది. ఈ సీజన్‌లో దుమ్ముదులిపేస్తున్న రింకూ సింగ్.. భవిష్యత్తులో తప్పకుండా భారత్ తరఫున ఆడుతాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ 251 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 58. 2018 నుంచి కేకేఆర్ తరఫున ఆడుతున్న రింకూ.. ఈ సీజన్‌లో జట్టుకి అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. మరి.. డేవిడ్ హస్సీ చెప్పినట్టు, భవిష్యత్తులో భారత్ తరఫున రింకూ సింగ్ ఆడగలడా? అతడు తన ఆటను మరింత మెరుగుపరచుకొని, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!