Andre Russell begs Sunil Narine to play T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్‌కు ఆ జట్టు హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విజ్ఞప్తి చేశాడు. స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024లో ఆడాలని కోరాడు. మెగా టోర్నీలో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే విండీస్ మొత్తం ఆనందిస్తుందని రస్సెల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న నరైన్.. 500 పైగా రన్స్, 16 వికెట్స్ పడగొట్టాడు. కేకేఆర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆండ్రీ రస్సెల్ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2024లో సునీల్ నరైన్ ప్రదర్శన చూసి చాలా సంతోషించా. గౌతమ్ గంభీర్ జట్టులోకి వచ్చాక మాకు మరింత ఉత్సాహం వచ్చింది. నరైన్‌తో కేకేఆర్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని గౌతీ పట్టుబట్టాడు. 2023లో 9 లేదా 10వ స్థానంలో ఆడాడు. అతడి అవసరం ఆ స్థానాల్లో పెద్దగా లేదు. ఈసారి ఓపెనర్‌గా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఓ బౌలర్ 500 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. బౌలింగ్‌లోనూ 16 వికెట్లనూ పడగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో కేకేఆర్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ నిర్ణయం వల్లే నరైన్‌కు ప్రమోషన్ లభించింది’ అని అన్నాడు.
Also Read: Shreyas Iyer: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్.. ఏకైక కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
‘అద్భుత ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్‌ను టీ20 ప్రపంచకప్ 2024లోనూ చూడాలనేది నా కోరిక. పొట్టి టోర్నీ కోసం మా జట్టును ప్రకటించే సమయంలోనూ చాలా సార్లు మాట్లాడా. రెండు వారాలపాటు ఒపించేందుకు ప్రయత్నించాం. ‘ప్లీజ్.. ఈ ప్రపంచకప్‌లో ఆడు. ఆ తర్వాత నువ్వు రిటైర్ అయిపో. నీ నిర్ణయం ఏంటో చెప్పు’ అని విజ్ఞప్తి చేశాం. అయితే అప్పటికే నరైన్ ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. దానిని మనం గౌరవించాలి. ఒకవేళ మనసు మార్చుకొని పొట్టి టోర్నీలో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే వెస్టిండీస్ మొత్తం ఆనందిస్తుంది’ అని ఆండ్రీ రస్సెల్ పేర్కొన్నాడు. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం విండీస్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఏవైనా మార్పులు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు అవకాశం ఉంది.