Aaron Finch on Hardik Pandya Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌లలో మూడు విజయాలు మాత్రమే అందుకుని.. ఏకంగా 8 ఓటములను ఎదుర్కొంది. ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల నేపథ్యంలో ముంబైపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేని మాట వాస్తవం. గత రెండు సీజన్‌లలో ముంబై పేలవంగా ఆడింది. అయితే ఈసారి ఆ జట్టు వైఫల్యం మీద జరుగుతున్నంత చర్చ గతంలో జరగలేదు. అందుకు కారణం.. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ కావడమే. మరోవైపు హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన బాగాలేదు. బ్యాట్, బంతితో మాత్రమే కాకూండా.. సారథిగా తేలిపోయాడు. గత మ్యాచ్‌లో హార్దిక్ 2 వికెట్లు తీసినా.. 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read: LSG vs KKR: ప్లేఆఫ్స్‌కు ముందు.. లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ!
స్టార్ స్పోర్ట్స్‌తో ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పూర్తిగా నీరసించిపోయినట్లు కనిపిస్తున్నాడు. హార్దిక్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అతడిని చూస్తే నాకు బాధేస్తోంది. నేను కూడా ఒకప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నా. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేసినా కలిసి రాదు. జట్టు సరైన ప్రదర్శన చేయనపుడు చాలా కష్టంగా ఉంటుంది. మనం బాగా ఆడకపోయినా.. జట్టు మంచి ప్రదర్శన చేస్తుంటే కెప్టెన్‌గా సంతోషించవచ్చు. కానీ జట్టు బాగా ఆడకపోతే.. కెప్టెన్‌గా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా కష్టం’ అని అన్నాడు.