సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు కీలక ప్లేయర్ దూరం కానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన హసరంగ.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండరని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎడమ మడమ గాయం కారణంగా ఐపీఎల్-2024 నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సీజన్ సగం గడిచిన తర్వాత స్లో పిచ్‌లపై హసరంగ బ్యాటర్లకు ప్రమాదకరంగా మారతాడని, అలాంటి మ్యాచ్ విన్నర్ దూరమవ్వడం సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బే అని అభిప్రాయపడుతున్నారు.
ఇంతకుముందు బెంగళూరు టీమ్ లో ఉన్న హసరంగ.. ఈసారి వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.50 కోట్లకు సొంతం చేసుకుంది. హసరంగ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తాచాటగలడు. కానీ, ఇటీవల బంగ్లాదేశ్ జరిగిన వన్డే సిరీస్‌లో హసరంగ గాయపడ్డాడు. దీంతో అతడు శ్రీలంక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో హసరంగ గాయం గురించి లంక బోర్డు జాగ్రత్త వహిస్తుంది. అందుకే అతడికి ఐపీఎల్‌లో ఆడటానికి అనుమతి లభించలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ రెండు మ్యాచ్ లు ఆడి.. ఒకదానిలో గెలిచింది. మరో మ్యాచ్ లో ఓడింది. ఈరోజు గుజరాత్ తో మ్యాచ్ ఆడుతుంది. కాగా.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హసరంగ స్థానాన్ని మరో స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో భర్తీచేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే స్పిన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతనికి తోడుగా షాబాజ్ అహ్మద్ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. మార్కండే, షాబాజ్‌తో పాటు జట్టులో వాష్టింగ్టన్ సుందర్ కూడా సమర్థవంతంగా స్పిన్ బౌలింగ్ చేయగలడు.