ఐపీఎల్ 2022 లో ఛాంపియన్స్ గా నిలిచిన గుజరాత్ జట్టు ను ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ఘనంగా సత్కరించారు. ఆదివారం రాజస్థాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది . ఈ గెలుపు నేపథ్యంలో గుజరాత్ జట్టు ఆటగాళ్లు సోమవారం ఆ జట్టు ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ బస్‌పై ఊరేగిన గుజరాత్ ఆటగాళ్లకు అభిమానులు జేజేలు పలికారు. అభిమానుల అరుపులు,కేకలతో అహ్మదాబాద్ వీధులు మారుమోగిపోయాయి.
ఉస్మాన్‌పురా రివర్ ఫ్రంట్ నుంచి బయలుదేరిన రోడ్ షో.. విశ్వకుంజ్ రివర్‌ఫ్రంట్ వద్ద ముగిసింది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రా, జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ సత్కరించారు. ఈ రోడ్ షో కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఒకే మ్యాచ్ అడింది. స్టేడియంలో లక్షమంది ప్రేక్షకుల ముందు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఇక హోం ఫ్యాన్స్ ముందు ఆడి టైటిల్ గెలిచిన రెండో జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డులకెక్కింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ సొంత అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.