ఐపీఎల్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగనుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఆడేది తొలి సీజన్ అయినా గుజరాత్ టైటాన్స్ అద్భుత ఆటతీరు కనపరుస్తోంది. హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని ఆ జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటివరకు టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించి 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టే తొలి జట్టుగా అవతరిస్తుంది.
అయితే మైదానంలోకి దిగకముందే గుజరాత్ టైటాన్స్ జట్టును చూసి పంజాబ్ కింగ్స్ జట్టు భయపడుతోంది. ఎందుకంటే గుజరాత్ టీమ్‌లో రాహుల్ తెవాటియా ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడ్డ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి గెలిచింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా రాహుల్ తెవాటియా వరుసగా రెండు సిక్సర్లు బాదేసి పంజాబ్ జట్టుకు గుండెకోత మిగిల్చాడు. దీంతో రాహుల్ తెవాటియా ఒకరకంగా పంజాబ్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా 4 మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. దీంతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే పంజాబ్ జట్టు వరుస విజయాలు నమోదు చేయాల్సిన పరిస్థితి. ఆ జట్టు భారీ స్కోరు చేయాలంటే ఓపెనర్లు శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ రాణించాల్సి ఉంది. రబాడ, రాహుల్ చాహర్, రిషి ధావన్, సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తున్నా అందరూ సమష్టిగా పోరాడాల్సి ఉంది.
IPL 2022: ఈద్ సంబరాల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు.. వీడియో వైరల్