ఒలింపిక్స్‌లో యువ గోల్ఫర్ అదితి అశోక్…అద్భుత ప్రదర్శన చేసింది. ఒకే ఒక్క స్ట్రోక్‌తో పతకాన్ని అందుకునే ఛాన్స్ మిస్సయింది. అంచనాలకు మించి రాణించిందంటూ…ప్రముఖులు కీర్తిస్తున్నారు. ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే…ఆమె సరికొత్త చరిత్ర సృష్టించేది. పోడియం ఎక్కలేకపోయినందుకు బాధగా ఉందని వాపోయింది అదితి.
భారత గోల్ఫర్, యువ క్రీడాకారిణి అదితి అశోక్‌కు ఒలింపిక్స్‌లో…తృటిలో మెడల్ మిస్సయింది. తొలి నుంచి అద్భుత ప్రదర్శన చేసిన అదితి…చివరి రౌండ్‌లో తడబడింది. దీంతో పతకం అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో మూడో రౌండ్ ముగిసే సరికి అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నాలుగో రౌండ్లో అదే ప్రదర్శన పునరావృతం చేస్తే ఆమె చరిత్ర సృష్టించేదే.
వర్షం, ఉరుములు, మెరుపులు, గాలి దుమారం ఆగిపోవడంతో ఆట మళ్లీ మొదలైంది. నాలుగో రౌండ్లో అదితి ఐదు బర్డీస్ సాధించింది. 5, 6, 8, 13, 14 హోల్స్‌ను నిర్దేశిత స్ట్రోక్స్ కన్నా ముందే పూర్తి చేసింది. 9, 11వ హోల్స్‌కు మాత్రం బోగీస్ ఎదురయ్యాయి. అంటే నిర్దేశిత స్ట్రోక్స్ కన్నా ఎక్కువ తీసుకుంది. నాలుగో రౌండ్లో ఆమె 3 అండర్ 68 పాయింట్లు సాధించగా… కాంస్యం గెలిచిన లిడియా కో 6 అండర్ 65తో నిలిచింది. అంటే ఆటను 71 స్ట్రోక్స్‌లో ముగించే బదులు 6 తక్కువ స్ట్రోక్స్‌తో ముగించింది. దాంతో మొత్తంగా అదితి 15 అండర్ 269 సాధించగా.. లిడియా 16 అండర్ 268 సాధించింది. కేవలం ఒకే ఒక్క స్ట్రోక్.. ఒకే ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే ఆమె సరికొత్త చరిత్ర సృష్టించేది.
నిజానికి అదితి అశోక్ అంటే దేశంలో 90% మందికి తెలియదు. గోల్ఫ్‌లో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయంసంగతే వారు ఎరగరు. కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ ముఖ్య అతిథిగా మారిపోయింది. ఒలింపిక్స్‌కు ముందు అదితి ర్యాంకు 200. అలాంటిది ప్రపంచ నంబర్ వన్ సహా టాప్-10లోని క్రీడాకారిణులకు ఆమె భారీ షాకులిచ్చింది. అంచనాలను తలదన్ని నాలుగో స్థానంలో నిలిచింది. ఎవరూ ఉహించని గోల్ఫ్‌లో పతకంపై ఆశలు రేపింది. అయితే తృటిలో పతకాన్ని చేజార్చుకోవడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అదితి రియో ఒలింపిక్స్‌లో ఉమ్మడిగా 41వ స్థానంలో నిలిచింది. కానీ టోక్యోలో ఏకంగా నాలుగో స్థానానికి మెరుగైంది. కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు ఎక్కువగా జరగకున్నా.. విదేశాలకు ప్రయాణించే అవకాశం లేకున్నా.. ఈ బెంగళూరు అమ్మాయి అద్భుతమే చేసింది. సంప్రదాయ క్రీడల్లోనే కాదు భారతదేశం సరికొత్త, వినూత్నమైన ఆటల్లోనూ రాణించగలదని నిరూపించింది అదితి అశోక్. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం బాధగా ఉందన్నారు భారత యువ గోల్ఫర్ అదితి అశోక్. పతకం గెలిస్తే బాగుండేదన్న ఆమె…ఇతర ఏ టోర్నీలో అయినా నాలుగో స్థానం వస్తే సంతృప్తి పడేదానని వెల్లడించింది. తొమ్మిది హోల్స్ బాగానే ఆడానన్న ఆమె…తర్వాత జరిగిన వాటిలో మంచి ప్రదర్శన చేస్తే…పతకం వచ్చేందన్నారు. పోడియం ఎక్కలేకపోయినందుకు బాధగా ఉందన్నారు అదితి అశోక్.
టోక్యో ఒలింపిక్స్‌లో మరో భారత క్రీడాకారిణి తనదైన ముద్ర వేసిందన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. అదితి అశోక్ గొప్ప ప్రదర్శన చేసిందన్న ఆయన…అద్భుతమైన నైపుణ్యంతో ఆకట్టుకున్నావని అన్నారు. మెడల్ తృటిలో తప్పిపోయినా…గోల్ఫ్‌లో ఏ భారతీయుడు చేరుకోలేనంత శిఖరాలకు చేరుకున్నావని ప్రధాని మోడీ అభినందించారు. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని అన్నారు. అదితి అశోక్ చరిత్ర సృష్టించిందన్నారు మంత్రి అనురాగ్ ఠాకూర్.