ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ పీవీ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధు ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఓటమి పాలైంది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 62 నిమిషాల్లో 16-21, 21-12, 14-21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిని చవిచూశాడు. అరగంటలోనే ముగిసిన పోరులో సింధు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. గత నెల థాయ్‌లాండ్ ఓపెన్ సెమీస్‌లో వెనుదిరిగిన సింధు.. ఈ సారి క్వార్టర్స్‌తో పోరాటం ముగించింది.