ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా భారత టీ20 లీగ్‌కే ఎక్కువ ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. తాజాగా ఇండియా లీడర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అతడు భారత టీ20 లీగ్ గురించి, టీమ్‌ఇండియాలో తన కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్ చాలా అభివృద్ధి చెందిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆట ఎంత అభివృద్ధి చెందిందో తాను కళ్లారా చూశానని సౌరభ్ గంగూలీ వెల్లడించారు. తనలాంటి క్రికెటర్లు ఇక్కడ వందల్లో సంపాదిస్తే.. ఇప్పటి ఆటగాళ్లు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉందన్నారు. భారత టీ20 లీగ్ అనేది క్రికెట్ అభిమానుల నుంచి పుట్టిందన్న ఆయన.. వాళ్లే ఈ టోర్నీని నడిపిస్తున్నారన్నారు. ఇదెంతో బలమైన లీగ్ అని.. మున్ముందు ఇలాగే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా అధిక ఆదాయం ఆర్జిస్తోందన్నారు. తాను ఎంతగానో ఇష్టపడే గేమ్ ఈ స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉందని గంగూలీ పేర్కొన్నారు.
అలాగే టీమిండియాలో తన కెప్టెన్సీపై కూడా దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కెప్టెన్సీ అనేది మైదానంలో జట్టును ముందుండి నడిపించడమేనని… లీడర్‌షిప్ అనేది జట్టును బలంగా తీర్చిదిద్దడమేనన్నారు. అలాంటప్పుడు తాను అజహరుద్దీన్‌తో పనిచేసినా.. సచిన్, ద్రవిడ్‌లతో పనిచేసినా వారితో పోటీపడలేదన్నారు. వాళ్లతో కలిసిపోయి బాధ్యతలను పంచుకున్నానని సౌరభ్ వివరించారు. భారత్‌లో అద్భుత నైపుణ్యం ఉందని.. యువ క్రికెటర్ల నుంచి యువ వ్యాపారవేత్తలు, ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారని చెప్పాడు. తాను విజయవంతమైన కెప్టెన్‌గా ఉండాలంటే తన తోటి ఆటగాళ్లను గౌరవప్రదంగా చూడాలనుకున్నట్లు చెప్పారు. దాంతో వాళ్లు అత్యుత్తమ క్రికెటర్లుగా తయారవుతారని నమ్మినట్లు గంగూలీ పేర్కొన్నారు.