IND Vs NZ: నేపియర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 టైగా ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై అయిందని అంపైర్లు ప్రకటించారు. డీఎల్ఎస్ ప్రకారం స్కోర్లు సమం అయ్యాయని తెలిపారు. తొలుత న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. వర్షం పడటంతో మ్యాచ్ సమంగా ముగిసిందని అంపైర్లు పేర్కొన్నారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షంతో రద్దు కాగా.. రెండో టీ20లో భారత్ విజయం సాధించింది.
Read Also: UN chief Antonio Guterres: ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతోంది..
కాగా ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అటు సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కైవసం చేసుకున్నాడు. గతంలోనూ వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. 2003 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్, 2011లో లార్డ్స్‌లో ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా ఆగిపోవడంతో టైగా ముగిశాయి.
Read Also: IND Vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియా టార్గెట్ 161 పరుగులు
కాగా ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయ అవకాశాలు సమానంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కాసేపటి తరువాత వర్షం ఆగిపోయినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదన్నారు. అంతకుముందు ఓపెనర్ ఇషాన్ కిషాన్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ (11) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అవ్వగా.. సూర్య కుమార్ యాదవ్ (13) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టాడు. అయితే మరో ఎండ్‌లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (30) వేగంగా ఆడడంతో భారత్ స్కోరు 9 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులకు చేరుకుంది.