India Vs England: మాంచెస్టర్ వేదికగా ఈరోజు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో షాక్ తగిలింది. 240 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. రెండో వన్డేలో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంప ముంచింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డి తీరాల్సిందే. ముఖ్యంగా మూడో పేసర్‌గా తొలి రెండు వన్డేల్లో ప్రసిద్ధ్ కృష్ణ విఫలమయ్యాడు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో స్థానం లభించే అవకాశాలున్నాయి.
Read Also: Yasir Shah: రీఎంట్రీతో చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్
అటు ఈ వన్డేలో అయినా విరాట్ కోహ్లీ రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలం అవుతోంది. మరోవైపు సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దిశగా టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మరోసారి రాణిస్తే భారీ స్కోరు ఖాయమవుతుంది. బౌలింగ్‌లో బుమ్రా, షమీ, హార్డిక్ పాండ్యా, చాహల్ నిలకడగా వికెట్లు తీయాలి.