Ind vs Aus : విశాఖ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆసీస్ మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 49 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని అందుకుంది.
ముందుగా టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. మంధన తన శైలికి తగ్గట్టుగా ఆకర్షణీయమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు సాధించింది. మరోవైపు ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడినా కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ చివర్లో వికెట్లు వేగంగా కోల్పోవడంతో 48.5 ఓవర్లలో 330 పరుగులకే ఆలౌట్ అయింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలో కొంచెం ఇబ్బంది పడ్డా, అలీస్సా హీలీ (Alyssa Healy) ఒక్కరే మ్యాచ్ గతి మార్చేసింది. ఆమె కేవలం 107 బంతుల్లో 142 పరుగులు బాదుతూ ఆసీస్‌ను గెలిపించింది. హీలీ ఇన్నింగ్స్‌లో సత్తా చాటడంతో ఆమె మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. చివరి ఓవర్ల వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పోరాడినా, హీలీ ధాటికి చివరికి ఓటమిని చవిచూసింది.