మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా అంచనాల మేరకు రాణించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్టు కావడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 357/6 స్కోరు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (96) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. క్రీజులో రవీంద్ర జడేజా (45), అశ్విన్ (10) ఉన్నారు. హనుమా విహారి (58) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఓపెనర్లు రోహిత్ (29), మయాంక్ (33) భారీ స్కోర్లు చేయలేకపోయారు. పేలవ ఫామ్ కారణంగా సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానె దూరం కావడంతో వారి స్థానాల్లో హనుమా విహారి, శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యారు. టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ (27) స్వల్ప స్కోరుకే వెనుతిరిగాడు.100వ టెస్టు హీరో విరాట్ కోహ్లీ (45) హాఫ్ సెంచరీ ముంగిట అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్‌దెనియా రెండు వికెట్లు, లక్మల్ , డిసిల్వ, ఫెర్నాండో, కుమార తలో వికెట్ తీశారు. ఆరో వికెట్‌కు పంత్, జడేజా 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.