టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. అయితే ఇప్పటికి మూడు మ్యాచ్‌లు టీమిండియా-సౌతాఫ్రికాల మధ్య జరుగగా.. అందులో మొదటి రెండు మ్యాచ్‌లు సౌతాఫ్రికా కైవవం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్ టీమిండియా ఖాతాలో పడగా.. నేడు నాలుగో మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియాకు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లతో పాటు టాపార్డర్ మరోసారి విఫలమైనా మిడిలార్డర్ లో వచ్చిన హార్ధిక్ పాండ్యా (46) తో పాటు దినేశ్ కార్తీక్ (55) లు ధాటిగా ఆడి భారత్ కు పోరాడే స్కోరును సఫారీల ముందు పెట్టారు. వీళ్ల పోరాటంతో భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. రెండో ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ ను కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (4) కూడా పేలవ ఫామ్ ను కంటిన్యూ చేస్తూ పెవిలియన్ కు చేరాడు. మరోవైపు గత మూడు మ్యాచులలో మాదిరిగానే దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ (27.. 3 ఫోర్లు, 1 సిక్సర్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. వరుసగా రెండు వికెట్లు పడటంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (17) కూడా ధాటిగా ఆడేదానికంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యమివ్వడంతో స్కోరు వేగం మందగించింది. తొలి పవర్ ప్లే ముగిసేసరికి 40 పరుగులు మాత్రమే చేయగలిగింది.