స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్‌లో బెబ్బులిలా చెలరేగే భారత్.. దక్షిణాఫ్రికాకు సిరీస్‌ను కోల్పోవడం ఇక లాంఛనమే. మొదటి టెస్టులో దారుణ ఓటమిని చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ప్రొటీస్ టీమ్ 489 రన్స్ చేయగా.. భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 26 రన్స్ చేయగా.. 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. టీమిండియాకు 400 రన్స్ లక్ష్యంను విధించే అవకాశం ఉంది. ఇప్పటికే పిచ్ టర్న్ అవుతున్న నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణంగా ఆడితే తప్ప టీమిండియాకు వైట్‌వాష్ తప్పకపోవచ్చు.
ఓవర్‌నైట్ స్కోరు 9/0తో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22) శుభారంభం ఇచ్చారు. తొలి గంటలో వికెట్ కోల్పోకుండా 56 పరుగులు చేయడంతో.. ప్రత్యర్థికి దీటైన స్కోరే చేస్తుందని అందరూ అనుకున్నారు. ఓపెనర్లు ఔటయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. యాన్సెన్ చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్స్ కోల్పోయింది. సాయి సుదర్శన్ (15), ధృవ్ జురెల్ (0), రిషబ్ పంత్ (7), ఆర్ జడేజా (6), నితీశ్ రెడ్డి(10)లు విఫలమయ్యారు. 150 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన భారత్‌ను వాషింగ్టన్ సుందర్ (48), కుల్దీప్ యాదవ్ (19) ఆదుకున్నారు. ఒక సెషన్ పాటు ఈ జోడి వికెట్ ఇవ్వలేదు. సుందర్ పెవిలియన్ చేరాక.. భారత్ ఆలౌట్ అవడానికి ఎంతో సమయం పట్టలేదు.
తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ అత్యధిక బంతులు ఎదుర్కొన్నాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన కుల్దీప్ 134 బంతులెదుర్కొని 19 పరుగులు చేశాడు. 92 బంతులాడిన వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 34.4 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని కుల్దీప్ అడ్డుకోవడం విశేషం. ఇలాంటి పోరాటం ప్రధాన బ్యాటర్లు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. కుల్దీప్ చూపిన పట్టుదల, సంయమనాన్ని స్పెషలిస్టు బ్యాటర్లు చూపించలేకపోయాయిరు. రెండో ఇన్నింగ్స్‌లో స్పెషలిస్టు బ్యాటర్లు పోరాటం చేసి జట్టుకు ఓటమి తప్పిస్తారేమో చూడాలి.