Harry Brook Creates Serveral Records With His First IPL Century: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచిన ఈ పవర్ హిట్టర్.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగి, తన పేరిట మూడు రికార్డులను లిఖించుకున్నాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేసిన బ్రూక్.. ఈ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన ఐదో ఇంగ్లీష్ బ్యాటర్‌గా మరో రికార్డ్ సాధించాడు. ఇప్పటిదాకా ఇంగ్లండ్ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టోలు ఐపీఎల్‌లో సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో బ్రూక్ వారి సరసన చేరాడు. ఇక ఐపీఎల్‌లో సెంచరీ నమోదు చేసిన మూడో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే.. వార్నర్, బెయిర్‌స్టో సొంత మైదానంలో (హైదరాబాద్) సెంచరీలు నమోదు చేయగా.. బయట సెంచరీ సాధించిన తొలి ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడిగానూ బ్రూక్ హిస్టరీ క్రియేట్ చేశాడు.
RCB vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై హైదరాబాద్ జట్టు 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (100) శతక్కొట్టడంతో పాటు కెప్టెన్ మార్ర్కమ్ (50) అర్థశతకంతో చెలరేగడంతో.. హైదరాబాద్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో అభిషేక్ శర్మ (32) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఇక 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా (75), రింకూ సింగ్ (58) గట్టిగానే పోరాడారు కానీ.. తమ జట్టుకి విజయాన్ని అందించలేకపోయారు. జగదీశన్ మినహాయించి మిగతా బ్యాటర్లెవ్వరూ పెద్దగా సత్తా చాటకపోవడం.. కేకేఆర్ పతనానికి కారణమైంది.