Gujarat Titans Won The Match By 34 Runs Against Sunrisers Hyderabad: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది. జీటీ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 154 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. దీంతో.. 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్‌లో టాపార్డర్‌తో పాటు స్టార్ బ్యాటర్లందరూ చేతులు ఎత్తేయడంతో.. సన్‌రైజర్స్‌కి ఈ ఓటమి తప్పలేదు. హెన్‌రిక్ క్లాసెన్ (44 బంతుల్లో 64) ఒంటరి పోరాటం కొనసాగించాడు. జట్టుని విజయతీరాలకు చేర్చాలన్న పట్టుదలతో రాణించాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ (27) కూడా మంచి స్టాండ్ ఇచ్చాడు కానీ, అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఒకవేళ క్లాసెన్ తరహాలో మరో బ్యాటర్ మంచి ప్రదర్శన కనబర్చి ఉంటే.. ఎస్ఆర్‌హెచ్ ఈ మ్యాచ్ సునాయాసంగా గెలిచేది. కానీ.. క్లాసెన్‌లాగే ఏ ఒక్కరూ పోరాట పటిమ కనబర్చలేదు. వరుసగా వికెట్లు పోతున్నప్పుడు.. ఆచితూచి ఆడకుండా, వచ్చిన ప్రతిఒక్కరూ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో.. వరుసగా పెవిలియన్ బాట పట్టారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (101) శతక్కొట్టడం, సాయి సుదర్శన్ (47) మెరుగైన ఇన్నింగ్స్ ఆడటంతో.. జీటీ అంత స్కోరు చేయగలిగింది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితమైంది. జీటీ బౌలర్ల ధాటికి ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లెవ్వరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. వచ్చినవాళ్లు వచ్చినట్టుగానే వెనుదిరిగారు. ఎవ్వరూ కనీస పోరాట పటిమ కనబర్చలేదు. తమ జట్టుని విజయతీరాలకు చేర్చాలన్న కసితో నిలకడగా ఆడలేకపోయారు. 59 పరుగులకే 7 వికెట్లు పోవడం చూసి.. సన్‌రైజర్స్ అత్యంత ఘోరంగా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ.. నేనున్నాడంటూ క్లాసెన్ అడ్డంగా నిలబడిపోయాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ కూడా మంచి మద్దతు ఇచ్చాడు. వీళ్లిద్దరు ఆచితూచి ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా.. క్లాసెన్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో అందరి మనసులు దోచేసుకున్నాడు. క్లాసెన్, భువి కలిసి.. 8వ వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీరి ఆటతీరు చూసి.. ఒకానొక దశలో ఛేజ్ చేస్తారేమోనని అనిపించింది కూడా!
కానీ.. చివర్లో రన్ రేట్ క్రమంగా పెరుగుతుండటంతో క్లాసెన్, భువి కూడా ఒత్తిడికి గురయ్యారు. ఆ ఒత్తిడిలోనే భారీ షాట్లు బాదేయాలని ప్రయత్నించి, క్లాసెన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే భువనేశ్వర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో వచ్చిన మయాంక్ మార్కండే సైతం.. రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆశ్చర్యపరిచాడు. మంచి విషయం ఏమిటంటే.. ఆలౌట్ అవ్వకుండా చివరివరకూ లాక్కురావడం. ఇదంతా క్లాసెన్, భువనేశ్వర్ భాగస్వామ్యం వల్లే సాధ్యం అయ్యింది. ఒకవేళ వాళ్లిద్దరిలో ఏ ఒక్కరైనా ఔటై ఉండుంటే.. 100+ పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘోరపరాజయాన్ని చవిచూసేది. ఇక జీటీ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ తలా నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్ ఒక వికెట్ తీశాడు.