Gautham Gambhir: టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే వన్డే ప్రపంచకప్‌కు ఆటగాళ్లు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎందుకంటే ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడమే ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు భారత్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొన్ని సూచనలు చేశాడు. అవసరమైతే వన్డే ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2023 సీజన్ ఆడకుండా ఆటగాళ్లను పక్కనపెట్టాలని సూచించాడు. ఆటగాళ్లపై పనిఒత్తిడి భారం కాకుండా బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నాడు. అందుకోసం ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నాడు.
Read Also: Rishi Sunak: 18 ఏళ్ల వరకు “గణితం” తప్పనిసరి.. కారణం ఇదే..
ఒకవేళ స్టార్ ఆటగాళ్లకు ఐపీఎల్ నుంచి విశ్రాంతి ఇస్తే పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కాస్త ఇబ్బంది పడొచ్చని.. అయితే అంతిమంగా భారత జట్టు ప్రయోజనాలే ముఖ్యమని గంభీర్ అన్నాడు. ఐపీఎల్ 2023లో పాల్గొనే టాప్ ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై ఎప్పటికప్పుడు ఫ్రాంచైజీలతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీ పర్యవేక్షించాలని సూచించాడు. ఎవరైనా స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌ను మిస్ అయితే వచ్చే నష్టమేమీ లేదన్నాడు. ఎందుకంటే ఐపీఎల్ ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుందని.. వరల్డ్ కప్ మాత్రం నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని గుర్తుంచుకోవాలని గంభీర్ తెలిపాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్తమ జట్టును సిద్ధం చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందన్నాడు.