టీ20 వరల్డ్‌కప్-2022కి మరెంతో సమయం లేదు. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఇది ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లను తీసుకోవాలన్న విషయంపై మాజీలు తమ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్‌ను కచ్ఛితంగా తీసుకోవాల్సిందేనని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లలో కిషన్ బాగా రాణించగలడని, ముఖ్యంగా బ్యాక్‌ఫుట్ షాట్‌లు ఆద్భుతంగా ఆడగలడని ఆయన తెలిపాడు.
గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్లేయింగ్ ఎలెవన్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు వచ్చినా.. ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు ఇవ్వాలి. రోహిత్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుంది. చిచ్చర పిడుగులా అతడు చెలరేగిపోతాడు కాబట్టి, భారత్‌కు శుభారంభం ఇవ్వగలడు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై కిషన్ ఆద్భుతంగా ఆడగలడు. ఇక కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో వస్తే, జట్టు పటిష్టంగా తయారవుతుంది. టీ20 వరల్డ్‌కప్ భారత తుది జట్టులో కిషన్ ఖచ్చితంగా ఉండాలి. అతడు రన్స్ చేసినా, చేయకపోయినా.. జట్టులో సానుకూల దృక్పథం తీసుకొస్తాడు’’ అని పేర్కొన్నాడు.
ఇదిలావుండగా.. టీ20 ఇంటర్నేషనల్‌లో విరేందర్ సెహ్వాగ్‌ను ఇషాన్ కిషన్ వెనక్కు నెట్టేశాడు. 2006లో టీ20 ఇంటర్నేషనల్స్‌లోకి అడుగుపెట్టిన సెహ్వాగ్.. మొత్తం 19 మ్యాచులు ఆడాడు. 21.88 సగటున 145.38 స్ట్రైక్ రేట్‌తో 394 పరుగులు చేశాడు. కానీ.. ఇషాన్ కిషన్ టీ20 ఇంటర్నేషనల్స్‌లోకి అరంగేట్రం ఇచ్చిన ఏడాదిలోనే సెహ్వాగ్‌ను అధిగమించాడు. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడిన ఈ చిచ్చరపిడుగు.. 36.27 సగటున 129.96 స్ట్రైక్ రేట్‌తో 399 పరుగులు చేశాడు. అటు.. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో కిషన్ 110 పరుగులు సాధించాడు.