Heath Davis Sensational Statement: న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ హీత్ డేవిస్ (50) సంచలన ప్రకటన చేశాడు. ఇన్నాళ్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రహస్యంగా ఉంచిన ఓ విషయాన్ని రివీల్ చేశాడు. తాను స్వలింగ సంపర్కుడిని (గే) అని హీత్ డేవిస్ వెల్లడించాడు.ఈ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ తెలుసని అతడు తెలిపాడు. దీని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చాలా కాలం పాటు తనలో తానే కుమిలిపోయాయనని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇక దాచాల్సిన అవసరం లేదని.. అందుకే బహిరంగంగా చెప్తున్నట్లు పేర్కొన్నాడు. తాను స్వలింగ సంపర్కుడినని ఆక్లాండ్ దేశవాళీ క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్కరికి తెలిసినా తన పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని హీత్ డేవిస్ చెప్పుకొచ్చాడు.
Read Also: Commonwealth Games 2022: కామన్‌వెల్త్ క్రీడల్లో అపశ్రుతి.. భారత సైక్లిస్ట్‌కు ప్రమాదం
గతంలో ఇంగ్లండ్ క్రికెటర్ స్టీవెన్ డేవిస్ మాత్రమే తాను ‘గే’ అని 2011లో బహిరంగంగా ప్రకటించాడు. అతడి తర్వాత ఇలాంటి సంచలన ప్రకటన చేసిన రెండో పురుష క్రికెటర్‌గా హీత్ డెవిస్ నిలిచాడు. న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెటర్లలో తాను గే అని చెప్పుకున్న తొలి ఆటగాడు హీత్ డేవిస్ కావడం గమనార్హం. 1994 ఏప్రిల్‌లో శ్రీలంక వన్డే మ్యాచ్‌లో హీత్ డేవిస్ న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే పెద్దగా విజయవంతం కాలేకపోయాడు. 1997లో తన చివరి వన్డే, టెస్టు మ్యాచ్ ఆడాడు. హీత్ డేవిస్ టెస్టుల్లో 17, వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. 2003లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లి అక్కడ కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2008లో ప్రమాదం కారణంగా హీత్ డేవిస్ ఎడమకాలి పాదం కోల్పోయాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో తాము స్వలింగ సంప్కరులమని చాలా మంది మహిళా క్రికెటర్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.