England Won Match Against Sri Lanka in T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి, త్వరగానే లక్ష్యాన్ని చేధిస్తారని అనుకుంటే.. శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌ని చివరివరకూ తీసుకెళ్లారు. వెనువెంటనే ప్రధాన వికెట్లు పడటంతో, మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఒకానొక దశలో శ్రీలంక గెలుస్తుందేమోనన్న అనుమానాలూ రేకెత్తాయి. కానీ.. చివర్లో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించడంతో, ఆ జట్టు గెలుపొందింది. ఈ దెబ్బకు.. ఆస్ట్రేలియా జట్టు సెమీస్ నుంచి వైదొలిగింది. ఇరు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నా.. రన్‌రేట్ ఇంగ్లండ్ జట్టుదే మెరుగ్గా ఉండటంతో, ఆస్ట్రేలియా నిష్క్రమించాల్సి వచ్చింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. మొదట్లో ఓపెనర్లు నిస్సాంక (67), మెండిస్ (18) శుభారంభాన్నే అందించారు. మెండిస్ పోయాక డీ సిల్వాతో కలిసి నిస్సాంక తమ జట్టు స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. కానీ.. డీ సిల్వా ఔటయ్యాక శ్రీలంకపై ఒత్తిడి పెరిగింది. రాజపక్స (22) ఒక్కడే కాస్త పర్వాలేదనిపిస్తే.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ఎవ్వరూ సత్తా చాటలేకపోయారు. 16వ ఓవర్లో నిస్సాంక ఔటయ్యాక శ్రీలంక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అందుకే.. 141 పరుగులే చేయగలిగింది. ఇక ఇంగ్లండ్ బౌలర్ల విషయానికొస్తే.. మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.
ఇక 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. మొదట్లో దుమ్ముదులిపేసింది. ఓపెనర్లు జాస్ బట్లర్ (28), అలెక్స్ హేల్స్ (47) చితక్కొట్టేశారు. దీంతో.. 9 ఓవర్లకే రెండు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ స్కోరు 82కి చేరుకుంది. ఆ జోరుని చూసి.. ఇంగ్లండ్ త్వరగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, వచ్చిన ప్రతీ ఒక్కరూ పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడిపోయింది. ఓపెనర్లు ఔటయ్యాక శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. బెన్ స్టోక్స్ (43) ఒక్కడే చివరి వరకూ క్రీజులో నిలబడి, తన జట్టుని గెలిపించాడు. ఒకవేళ అతడు కూడా ఔట్ అయి ఉండుంటే, ఇంగ్లండ్ జెండా ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చేది.