బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నా మనోళ్లు సత్తా చాటుతున్నారు. తొలిరోజు రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగగా.. రెండో రోజు బుమ్రా ఇంగ్లండ్‌కు తన దెబ్బ రూచి చూపించాడు. బ్యాటింగ్‌లో ఒకే ఓవర్లో 35 పరుగులు పిండుకున్న బుమ్రా.. బౌలింగ్‌లోనూ రాణించాడు. కెప్టెన్‌గా ఎలాంటి ఒత్తిడిని అతడు ఎదుర్కొన్నట్లు కనిపించలేదు. బుమ్రా విజృంభించడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది. రూట్ (31), పోప్ (10), క్రాలీ (9), లీస్ (6), లీచ్ (0) అవుటయ్యారు. క్రీజులో బెయిర్ స్టో (12), బెన్ స్టోక్స్ (0) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రాకు 3 వికెట్లు దక్కగా షమీ, సిరాజ్‌లకు తలో వికెట్ పడింది.
Read Also: MS Dhoni: ధోనీకి మోకాలి శస్త్రచికిత్స.. ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
అటు రెండో రోజు 338/7 స్కోరుతో ఆట ప్రారంభించిన భారత జట్టు కాస్త దూకుడుగా ఆడింది. షమీ(31 బంతుల్లో 16 పరుగులు) వరుస బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డుకు ఊపొచ్చింది. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఇక రవీంద్ర జడేజా 83 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగి క్రమశిక్షణగా ఆడుతూ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అనంతరం బుమ్రా ఒకే ఓవర్లో 35పరుగులు పిండుకోవడంతో భారత్ స్కోరు 416 పరుగులకు చేరుకుంది.